Pages

Sunday 9 February 2014

మీ నేతల గురించి మీకు ఎంత తెలుసు?

రెండు చేతులు కలిస్తే చప్పట్లు. నాలుగు గొంతుకలు పెగిలితే నినాదం. పదిమంది కూడితే సంఘం. అనేకానేక సంఘాలు ప్రజాస్వామ్యానికి రక్షణ కవచాలవుతున్నాయి. కదలికే లేని నిత్యనిర్లిప్త వ్యవస్థలో కదనోత్సాహాన్ని నింపుతున్నాయి. భారత గణతంత్ర ఘనవిజయంలో ఆ సమష్ఠిశక్తి ప్రాధాన్యాన్ని విస్మరించలేం!

ఒక గడ్డిపోచ దుర్బలమైంది. వేయి గడ్డిపోచలు దుర్భేద్యమైనవి.
- ఏనుగునే బంధిస్తాయి.

ఒక చీమ ఒంటరి.వేయి చీమలు...దండు.
- మహాసర్పాన్నయినా మట్టి కరిపిస్తాయి.

ఒక స్వరం అనామకం.వేయి గొంతుకలు రణన్నినాదం.
- పార్లమెంటు దాకా ప్రతిధ్వనిస్తాయి.

వ్యక్తివల్ల కానిది...సమూహంతో సాధ్యమౌతుంది.
సామాన్యుడు ఏకవచనం అయితే, సంఘం బహువచనం!

పది ప్లస్ పది ఎప్పుడూ వందే!
వ్యవస్థలోని లోపాల్ని కడిగేయడానికీ, సమాజంలోని పాపాల్ని తరిమేయడానికీ ...వృత్తి ఉద్యోగాల్నీ సంపాదన అవకాశాల్నీ తృణప్రాయంగా త్యజించినవాళ్లున్నారు. జీతంలో లేని సంతృప్తిని జీవితాల్ని మార్చడంలో పొందుతున్నవారూ... ఖరీదైన జీవనశైలిలో కరవైన ఆనందాన్ని మురికివాడల జనం మధ్య వెతుక్కుంటున్నవారూ ఎంతోమంది. లక్ష్యశుద్ధి, సామాజిక స్పృహ, నిబద్ధత - భావసారూప్యం ఉన్న బాధ్యతాయుత పౌరులను ఒక్కచోటికి చేరుస్తున్నాయి, సంఘాలు పెట్టిస్తున్నాయి, సమష్ఠి పోరాటాలకు శంఖారావాన్ని పూరింపజేస్తున్నాయి.

ఒక సంఘం - నేతల పనితీరుపై ప్రోగ్రెస్ కార్డులు తయారుచేస్తోంది.

ఒక సంఘం - ఓటు హక్కు ప్రాధాన్యాన్ని యువతకు వివరిస్తోంది.

ఒక సంఘం - అవినీతి బాగోతాల్ని బట్టబయలు చేస్తోంది.

ఒక సంఘం - పాలకులకు పాలనా పాఠాలు చెబుతోంది.

నిలదీసేదొకటి, నిప్పుతో కడిగేదొకటి. ప్రశ్నించడం నేర్పేదొకటి, పోరాట సూత్రాలు బోధించేదొకటి. చెవి మెలి తిప్పేదొకటి, చాచి లెంపకాయ కొట్టేదొకటి. దేని శైలి దానిదైనా, ఎవరి లక్ష్యాలు వారికున్నా అంతిమ ప్రయోజనం - ప్రజాస్వామ్య పరిరక్షణే.

నేతల తలరాతలు...
ఎన్నికలు వచ్చేస్తాయి. ప్రచారం మొదలవుతుంది.

'హామీలన్నీ నెరవేర్చా...' బల్లగుద్ది చెబుతాడో అభ్యర్థి.

'నా జీవితం తెరిచిన పుస్తకం' - రామచంద్రుడిలా పోజుకొడతాడో అభ్యర్థి.

'ఈ వంతెనలూ రహదారులూ నా చలవే' - ఆర్భాటంగా ప్రకటిస్తాడో అభ్యర్థి.

ఏది నిజం.ఎంత నిజం!

ఎవర్ని నమ్మాలి, ఎవర్ని పొమ్మనాలి!

ఎవరికి ఓటెయ్యాలి. ఎవరిపై వేటెయ్యాలి.

అభ్యర్థుల పుట్టుపూర్వోత్తరాలన్నీ పుటలు పుటలుగా ఓ చోట దొరికితే బావుండు. చప్పున చదివేసి, చక్కని నిర్ణయానికి రావచ్చు - అనుకుంటాడు ఓటరన్న.

నేతలంటే మాటలా...

అంగబలం, అర్థబలం, అధికారబలం...

నేరచరిత్ర, మాఫియా సంబంధాలు, ఖాకీల అండదండలు...

కొందరు ఖద్దరు పెద్దల్ని కదిలించడమంటే, తేనె తుట్టెలో చేయిపెట్టడమే!

అయినా, ప్రజా సంఘాలు వెన్నుచూపడం లేదు. దర్జా కబ్జాల నుంచి దారుణ నేరాల దాకా ఆ రక్తచరిత్రనంతా రికార్డులకెక్కిస్తున్నాయి.

దేశంలోని 4,807 మంది ఎమ్మెల్యేలూ ఎంపీల్లో 30శాతం మందికి నేరచరిత్ర ఉంది. అందులో 14 శాతం దాకా హత్యలూ, అత్యాచారాలూ వంటి తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

2004-2011 మధ్యకాలంలో...కాంగ్రెస్, భాజపా, నేషనలిస్ట్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఎస్‌పీ - దేశంలోని ఆరు ప్రధాన రాజకీయ పార్టీల మొత్తం ఆదాయం రూ.4,895.96 కోట్లు. ఇందులో 91.01 శాతం విరాళాలు 'అజ్ఞాత' దాతల నుంచే!

- ఆ అంకెలు ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తాయి. ఆ సత్యాలు శూలాలై గుండెల్లో గుచ్చుకుంటాయి. ఆ చేదు అనుభవాల్లోంచి పాఠాలు నేర్చుకోవాల్సిందే. అవినీతి పీఠాల్ని కూకటివేళ్లతో పెకిలించేయాల్సిందే.

ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్ - http://adrindia.org/)...లక్ష్యమూ అదే. దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం రాజకీయాల మురికిని వదలగొట్టే కార్యక్రమాన్ని చేపట్టింది ఏడీఆర్. ప్రచార ఆర్భాటాలకు దూరంగా, ఒత్తిళ్లకూ బెదిరింపులకూ తలొగ్గకుండా...పాలకుల్ని నిగ్గదీస్తోంది. ఐఐఎమ్ మాజీ డైరెక్టర్-ఇన్‌ఛార్జి జగ్‌దీప్ చొక్కర్ నేతృత్వంలో ప్రారంభమైన ఈ సంస్థ...గత ఎన్నికల్లో అరవైమూడు వేలమంది అభ్యర్థుల ఆస్తిపాస్తుల చిట్టాల్ని ఆన్‌లైన్‌లో ఉంచింది. మైనేత.ఇన్ఫోలోకి వెళ్లి అభ్యర్థి పేరు టైపు చేస్తే చాలు...సదరు నేత చరిత్రంతా కళ్లముందు కనిపిస్తుంది.




No comments:

Post a Comment