Pages

Sunday 9 February 2014

అసలుసిసలు నాయకురాలు...

ఆమధ్య గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఏవో సమస్యల గురించి చర్చించడానికి మహిళా కార్పొరేటర్లకు ఫోన్లు చేశారు. సదరు అధికారి ఇట్నుంచి 'హలో' అనడమే తరువాయి ...'ఎస్...నేను కార్పొరేటర్ని మాట్లాడుతున్నా' అంటూ పురుష స్వరాలు! ఆ గొంతుకలు మహిళా కార్పొరేటర్ల భర్తలవని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భాగ్యనగరంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే...మారుమూల పంచాయతీల గురించి చెప్పేదేముంది! పేరు ఆమెది, పెత్తనం ఆయనది. ఆ దుస్థితి పోవాలంటే...ఆమెకు తన బాధ్యతలేమిటో తెలియాలి, హక్కులేమిటో అర్థంకావాలి. 'ద హంగర్ ప్రాజెక్ట్'- ఆ సాధన సంపత్తినంతా అందిస్తోంది. పంచాయతీ స్థాయిలో మహిళా ప్రజాప్రతినిధుల సాధికారతే ఆ సంస్థ లక్ష్యం. శిక్షణలో భాగంగా వారి సంభాషణా నైపుణ్యాన్ని పెంచుతుంది, చట్టాల మీద అవగాహన కల్పిస్తుంది, ప్రభుత్వ పథకాల్ని పరిచయం చేస్తుంది, బడ్జెట్ సూత్రాలు బోధిస్తుంది.


ఆ శిక్షణలో రాటుదేలిన ఒకానొక మహిళా సర్పంచి పేరు చంద్రమకర్జీ. ఒడిశా గజపతి జిల్లాలోని కుగ్రామం ఆమెది. వూళ్లో మద్యం దుకాణం పెట్టుకోడానికి అనుమతి కావాలంటూ ఓ దళారి వచ్చాడు. కుదర్దని కచ్చితంగా చెప్పేసింది. ఎక్సైజ్ అధికారులు నచ్చజెప్పబోయారు. అయినా కాదంది. లక్ష రూపాయల నోట్ల కట్ట లంచంగా ఇవ్వబోయారు. నిర్మొహమాటంగా తిరస్కరించింది. చివరికి, భర్త మాటా వినలేదు. మద్యరహిత గ్రామంగా తన పల్లెని తీర్చిదిద్దుతోంది చంద్రమకర్జీ.

నిజానికి ఈ శిక్షణను...పంచాయతీలకే పరిమితం చేయకూడదు. కార్పొరేషన్లకూ ఆ మాటకొస్తే ... అసెంబ్లీలకూ పార్లమెంటుకూ కూడా విస్తరించాలి. 'చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టినంత మాత్రాన మహిళాసాధికారత సాధ్యమైనట్టు కాదు. ఆమె నోరు విప్పాలి. ఆ దిశగా మేం కృషిచేస్తున్నాం' అంటారు హంగర్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకులు గంగా గుప్త. నార్వే ప్రభుత్వానికి ఈ కార్యక్రమం భలేగా నచ్చింది. ఆర్థిక సాయం అందించడానికి ముందుకొచ్చింది. భారత ప్రభుత్వానికే 'హంగర్ ప్రాజెక్ట్' ప్రాధాన్యం అర్థమైనట్టు లేదు. నిజంగా అర్థంకాలేదా, అర్థమైనా కానట్టు నటిస్తోందా... అన్నదే ప్రశ్న.

No comments:

Post a Comment