Pages

Sunday 9 February 2014

ఓటేద్దాం రండి!

భారత్ గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన ఆరు దశాబ్దాల తర్వాత కూడా...ఎన్నికల్లో పోలింగ్ అరవై శాతానికి మించడం లేదు. ఓటర్ల నమోదూ అంతంతమాత్రమే! ఆ నిర్లిప్తత ప్రజాస్వామ్యవాదులను కలవరపెడుతోంది.

మూర్ఖుల అకృత్యాలకంటే..
మంచివారి మౌనమే ప్రమాదకరం.

ఎంతోకొంత బాధ్యతగా వ్యవహరించాల్సిన విద్యావంతులే ఎన్నికల క్రతువుకు దూరంగా ఉంటే, ఇక ప్రజాస్వామ్యానికి దిక్కెవరు! ఆ స్తబ్దతను పారదోలి...యువతను ఓటింగ్ ప్రక్రియలో భాగం చేయడమే లక్ష్యంగా 'లెట్స్ ఓట్' ఆవిర్భవించింది. ప్రాజెక్టులే ప్రపంచంగా, శాలరీ ప్యాకేజీలే సర్వస్వంగా బతికే ఐటీ ఉద్యోగులపై ఆ సంఘం దృష్టి సారించింది. ఎన్నికల సంఘాన్నీ, ఐటీ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లనూ, ఉద్యోగులనూ ఓ ఛత్రం కిందికి తెచ్చి...ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఐటీ కారిడార్స్ దాకా తీసుకెళ్లింది. 'లెట్స్ ఓట్' చొరవతో...సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఓటర్ల నమోదు 50 శాతం నుంచి 80 శాతానికి పెరిగింది.

విద్యార్థుల్లోనూ అంతే! ఓటరు నమోదు పట్ల తీవ్ర నిరాసక్తత. క్రికెట్ మీదున్న ఆసక్తి రాజకీయాల మీద లేదు. రోజంతా వరుసలో నిలబడి కొత్తసినిమా టికెట్లు తెచ్చుకుంటారు కానీ, ఓ గంటసేపు పోలింగ్‌బూత్ ముందు నిలబడటానికి తెగ నామోషీ! ధోనీ సెంచరీ కొడితే పండగ చేసుకుంటారు. సచిన్ రిటైర్ అయితే తిండిమానేస్తారు. దేశ ప్రగతినీ తమ భవితనూ శాసించే... ప్రజా ప్రతినిధుల విషయంలో మాత్రం మహా నిర్లిప్తత! ఆ జడత్వాన్ని పటాపంచలు చేసి...ఎన్నికలంటే యువతలో ఆసక్తిని పెంచడమే లక్ష్యంగా 'లెట్స్ ఓట్' హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లోని కాలేజీ క్యాంపస్‌లలో అవగాహన శిబిరాలు నిర్వహిస్తోంది. సెల్‌ఫోన్ ద్వారా ఓటర్ల నమోదు కోసం ప్రత్యేకంగా ఓ అప్లికేషన్ (ఆప్) రూపొందించింది. 'యువత, ఉద్యోగుల నిర్లిప్తత కారణంగానే సచ్చీలురైన అభ్యర్థులు ఎన్నికల్లో గెలవలేకపోతున్నారు. అరాచకశక్తులు అధికారంలోకి వస్తున్నాయి' అంటారు 'లెట్స్ ఓట్' వ్యవస్థాపకులు జేఏ చౌదరి.

No comments:

Post a Comment